బ్రాహ్మణ ప్రొఫెసర్ అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం ఎంపీ!

  • మే 5న కరోనాతో కన్నుమూసిన ప్రొఫెసర్
  • అదే సమయంలో కరోనాతో ఆసుపత్రిలో చెల్లెలు
  • విదేశాల్లో ఉన్న బంధువులు
  • అంత్యక్రియలకు ముందుకొచ్చిన కర్ణాటక ఎంపీ
కరోనా వేళ అంత్యక్రియలకు కూడా ఎంతో కష్టపడాల్సి వస్తోంది. వైరస్ తీవ్రత దృష్ట్యా అనాథ శవాల్లా అంతిమ సంస్కారాలు జరపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రయాణ ఆంక్షలతో బంధువులు వచ్చే పరిస్థితి కూడా లేదు. తాజాగా కర్ణాటకలో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ ముస్లిం ఎంపీ బ్రాహ్మణ ప్రొఫెసర్ అంత్యక్రియలు నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు సయ్యద్ నజీర్ హుస్సేన్ ఇటీవల ఓ బ్రాహ్మణ ప్రొఫెసర్ కరోనాతో చనిపోతే మతాలకు అతీతంగా ముందుకొచ్చి అంత్యక్రియలకు అన్నీ తానయ్యారు.

80 ఏళ్ల ప్రొఫెసర్ సావిత్రీ విశ్వనాథన్ ఢిల్లీ యూనివర్సిటీలో చైనీస్, జపనీస్ భాషల విభాగం హెడ్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. ఈ నెల 5న కరోనాతో కన్నుమూశారు. ఆమె చెల్లెలు మహాలక్ష్మి ఆత్రేయి కూడా మరో ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. ప్రొఫెసర్ సావిత్రికి భారత్ లో చెల్లెలు తప్ప ఇంకెవరూ లేరు. ఇతర కుటుంబ సభ్యులు ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరపడ్డారు. ప్రయాణ ఆంక్షల కారణంగా వారెవరూ వచ్చే అవకాశం లేకపోవడంతో ఫ్యామిలీ ఫ్రెండయిన ఎంపీ నజీర్ హుస్సేన్ అంత్యక్రియలు జరిపేందుకు ముందుకొచ్చారు. శ్రీరంగపట్నంలో ప్రొఫెసర్ సావిత్రి అస్థికలను పశ్చిమ వాహినిలో కలిపారు.

దీనిపై ఎంపీ మాట్లాడుతూ, ఆమె తమ కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలని, తల్లి కన్నా మిన్న అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులు విదేశాల్లో ఎక్కడెక్కడో ఉండడంతో, హిందూ సంప్రదాయాల ప్రకారం తానే ఆ క్రతువు నిర్వహించానని వెల్లడించారు. ప్రొఫెసర్ సావిత్రి భర్త నుంచి విడిపోయారని, ఆమెకు పిల్లలు ఎవరూ లేరని ఎంపీ నజీర్ హుస్సేన్ తెలిపారు.


More Telugu News