'శ్యామ్ సింగ రాయ్'కి సెట్టు తెచ్చిన నష్టం!

  • షూటింగు దశలో నాని సినిమా
  • ఆరున్నర కోట్లతో భారీ సెట్లు
  • వానకు తడిసి పాడైన సెట్టు
  • సంగీత దర్శకుడిగా మిక్కీ. జె మేయర్  
నాని కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా రూపొందుతోంది. నాని కెరియర్లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సెట్లు వేశారు. నిన్న మొన్నటి వరకూ ఈ సెట్లోనే కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తూ వచ్చారు. అయితే కరోనా అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, షూటింగును వాయిదా వేశారు.

అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సెట్ భారీగానే దెబ్బతిందట. ఇలా జరగడం నిర్మాతకు కొంత నష్టాన్ని కలిగించిందనే అంటున్నారు. సెట్టును ఒకసారి మళ్లీ చెక్ చేసుకుని, తగిన మరమ్మతులు చేసిగానీ షూటింగుకు దిగడానికి లేదట. కరోనా లేకపోతే ఈ పాటికే ఆ సెట్టులో షూటింగు అయిపోయేదనీ, ఈ నష్టం జరగకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డిటెక్టివ్ గా నటిస్తుండగా, ఆయన సరసన హీరోయిన్లుగా సాయిపల్లవి .. కృతి శెట్టి కనిపించనున్నారు. మిక్కీ.జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.


More Telugu News