రఘురాజుకి జనరల్ ఎడిమా, కాలివేలికి ఫ్రాక్చర్.. ఆర్మీ ఆసుపత్రి నివేదిక వెల్లడి!

  • సీల్డ్ కవర్ ను తెరిచిన జస్టిస్ వినీత్ శరన్
  • రఘురాజుకు ఫ్రాక్చర్ అయినట్టు రిపోర్టులో ఉందన్న న్యాయమూర్తి
  • మధ్యాహ్నం 2.30కు విచారణ వాయిదా
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు జరిపిన వైద్య పరీక్షల రిపోర్టును, వీడియో రికార్డింగును సుప్రీంకు తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో అందజేసింది. ఈ సీల్డ్ కవర్ ను జస్టిస్ వినీత్ శరన్ ఈ రోజు తెరిచారు. ముగ్గురు వైద్యులు పరీక్షించిన నివేదిక, ఎక్స్ రే, వీడియో కూడా పంపించారని ఈ సందర్భంగా జస్టిస్ శరన్ తెలిపారు. రఘురాజుకు జనరల్ ఎడిమా ఉందని, కాలి వేలికి ఫ్రాక్చర్ అయినట్టు కూడా రిపోర్టులో ఉందని చెప్పారు.

విచారణ సందర్భంగా రఘురాజు తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తూ... ఒక సిట్టింగ్ ఎంపీకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. కస్టడీలో రఘురాజును చిత్ర హింసలకు గురి చేశారనే విషయం తేలిపోయిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని ధర్మాసనాన్ని కోరారు.

మరోవైపు, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ... ఆ గాయాలను రఘురాజు స్వయంగా చేసుకున్నారా? లేదా? అనే విషయం తెలియదని కోర్టుకు చెప్పారు. ఈ సందర్భంగా దవే వాదనపై ధర్మాసనం స్పందిస్తూ... సీఐడీ కస్టడీ నుంచి ఆర్మీ ఆసుపత్రికి వెళ్లే సమయంలో రఘురాజు గాయాలు చేసుకున్నారని మీరు అంటున్నారా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది.

రిపోర్టులో రఘురాజు కాలికి ఫ్రాక్చర్ అయిందనే విషయం కీలక అంశంగా మారింది. కేసు విచారణ ఈ అంశం చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


More Telugu News