ఆసియా కుబేరుల్లో రెండో స్థానానికి ఎదిగిన అదానీ

  • అదానీ సంపద 6,650 కోట్ల డాలర్లు
  • ఈ ఏడాది ఏకంగా 3,270 కోట్ల డాలర్ల సంపద పెరుగుదల
  • తొలి స్థానంలో ముఖేశ్ అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. ఆసియా శ్రీమంతుల జాబితాలో ఆయన రెండో స్థానానికి ఎదిగారు. తొలి స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఈ వివరాలను బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ వెల్లడించింది.

ఇప్పటి వరకు ఆసియా శ్రీమంతుల జాబితాలో చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ రెండో స్థానంలో ఉన్నారు. తాజాగా ఆయన స్థానాన్ని ఆక్రమించిన అదానీ..షాన్షాన్ ను మూడో స్థానానికి నెట్టేశారు. షేర్ మార్కెట్లో అదానీ సంస్థల షేర్ల ర్యాలీ కొనసాగుతుండటంతో... ఆయన సంపద పెరుగుతూ వస్తోంది. అదానీ ప్రస్తుత సంపదను 6,650 కోట్ల డాలర్లు (రూ. 4.86 లక్షల కోట్లు)గా అంచనా వేశారు. ఇదే సమయంలో ముఖేశ్ అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఇది రూ. 5.58 లక్షల కోట్లు. ఈ ఏడాదిలో అదానీ ఆస్తి ఏకంగా 3,270 కోట్ల డాలర్లు పెరిగింది.

ప్రపంచ కుబేరుల విషయానికి వస్తే... శ్రీమంతుల జాబితాలో అంబానీ 13వ స్థానం, అదానీ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. షాన్షాన్ 15వ స్థానానికి పడిపోయారు.


More Telugu News