మహారాష్ట్రలో ఎదురుకాల్పులు.. 13 మంది మావోయిస్టుల హతం

  • బీడీ ఆకుల కాంట్రాక్ట్‌పై చర్చించేందుకు గ్రామస్థులతో సమావేశానికి మావోల యత్నం
  • ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్
  • పెద్ద ఎత్తున మారణాయుధాలు, సాహిత్యం, పేలుడు పదార్థాల స్వాధీనం
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. తూర్పు విదర్భలోని అడవిలో పైడి-కోట్మి మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ గ్రామ సమీపంలో మావోయిస్టులు శిబిరం వేసుకున్నారన్న సమాచారంతో  సి-60 కమాండోలు అక్కడికి చేరుకున్నారు.

 ఈ సందర్భంగా మావోయిస్టులు-కమాండోల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 13 మంది మావోలు హతమయ్యారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన పోలీసులు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ఇతర నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు కసన్‌సూర్ దళం బీడీ ఆకుల కాంట్రాక్ట్‌ విషయమై గ్రామస్థులతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు ఆగిన అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 13 మంది మావోలు హతమైనట్టు గుర్తించారు.


More Telugu News