సీఎం జగన్ నన్ను చాలా ఆప్యాయంగా పలకరించేవారు: శాసన మండలి చైర్మన్ షరీఫ్

  • మండలి చైర్మన్ గా ఈ నెలతో ముగియనున్న షరీఫ్ పదవీకాలం
  • నేడు వీడ్కోలు సభ.. భావోద్వేగాలకు గురైన షరీఫ్
  • జగన్ తనను ఎంతో గౌరవంగా చూసుకున్నారని వెల్లడి
  • చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించారని వివరణ
ఏపీ శాసనమండలి చైర్మన్ గా షరీఫ్ పదవీకాలం ఈ నెలతో ముగియనుండడంతో ఆయనకు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రస్తావన తీసుకువచ్చి భావోద్వేగాలకు గురయ్యారు. జగన్ తనను ఎంతో ఆప్యాయంగా "షరీఫ్ అన్నా" అని పిలిచేవారని గుర్తు చేసుకున్నారు.

రాజధానుల బిల్లుల సమయంలో ఎంతో ఒత్తిడికి లోనయ్యానని, రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ ఎప్పట్లాగానే "షరీఫ్ అన్నా" అని పిలిచి, ఎందుకలా బాధగా ఉన్నారని అడిగారని షరీఫ్ వెల్లడించారు. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలతో కలత చెందినట్టు ఆయనకు చెప్పానని తెలిపారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ తనను సీఎం జగన్ చాలా గౌరవించారని పేర్కొన్నారు.

'అందరూ నాకు సహనం ఎక్కువని అంటారు... కానీ నాకంటే సీఎం జగన్ కు సహనం ఎక్కువ' అని షరీఫ్ అభిప్రాయపడ్డారు. పరిస్థితుల నేపథ్యంలో మండలి చైర్మన్ పదవి తనను వరించిందని, చంద్రబాబు తన కష్టాన్ని గుర్తించి చైర్మన్ పదవికి ఎంపిక చేశారని వివరించారు.


More Telugu News