స్పీకర్ ఓంబిర్లా, రాజ్ నాథ్ లను కలసి రఘురామ కుటుంబ సభ్యుల ఫిర్యాదు

  • ఇటీవల రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రఘురామ
  • నిన్న అమిత్ షాను కలిసిన రఘురామ కుటుంబ సభ్యులు
  • నేడు రాజ్ నాథ్, ఓం బిర్లాలతో సమావేశం
  • రఘురామకు ప్రాణహాని ఉందని విజ్ఞాపన
ఓవైపు ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో పర్యటిస్తూ కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. రఘురామకృష్ణరాజు అర్ధాంగి రమాదేవి, కుమారుడు భరత్, కుమార్తె ఇందూ ప్రియదర్శిని నిన్నటి నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. గతరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన రఘురామ కుమారుడు, కుమార్తె ఆయనకు వినతిపత్రం అందించారు.

ఇవాళ రఘురామ అర్ధాంగి, తనయుడు, తనయ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలతో భేటీ అయ్యారు. తొలుత రాజ్ నాథ్ ను కలిసి పరిస్థితులను వివరించారు. రఘురామకృష్ణరాజు ప్రాణాలకు ముప్పు ఉందని, జగన్ ప్రభుత్వం నుంచి తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆపై స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమయ్యారు.

రఘురామకృష్ణరాజును జగన్ సర్కారు వేధింపులకు గురిచేస్తోందని ఫిర్యాదు చేశారు. అన్యాయంగా రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ విషయంలో స్పీకర్ జోక్యం చేసుకోవాలని రఘురామ కుటుంబ సభ్యులు కోరారు. దీనిపై స్పందించిన ఓం బిర్లా... ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక కోరతానని, తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  


More Telugu News