ఒకే ఇంజక్షన్ తో కరోనా ఖతం.. ఆస్ట్రేలియా-అమెరికా పరిశోధకుల ప్రయోగాల్లో సానుకూల ఫలితం!

  • ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సత్ఫలితాలు
  • వైరస్ సంతతి వృద్ధికాకుండా అడ్డుకుంటున్న ఔషధం
  • 99.9 శాతం మేరకు క్షీణించిన వైరస్
కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో ఇది మరో ముందడుగు. కేవలం ఒకే ఒక్క ఔషధంతో కరోనా పనిపట్టేందుకు ఆస్ట్రేలియా-అమెరికా శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో సానుకూల ఫలితాలు వచ్చాయి. గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన మెంజీస్ హెల్త్ ఇనిస్టిట్యూట్ నేతృత్వంలో అభివృద్ధి చేసిన ఔషధాన్ని ఎలుకలపై ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్టు పరిశోధకులు తెలిపారు.

శరీరంలోకి ప్రవేశించిన వైరస్ తన సంతతిని వృద్ధి చేసుకోకుండా ఈ ఔషధం నిలువరిస్తున్నట్టు తేలింది. ఎలుకల్లో వైరస్ కణాలు 99.9 శాతం మేర క్షీణించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎలుకల్లో వచ్చిన ఫలితాలే మనుషుల్లోనూ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా బాధితులకు ఐదు రోజులపాటు ప్రతి రోజూ దీనిని ఇంజక్షన్ రూపంలో ఇవ్వడం ద్వారా కరోనాను అడ్డుకోవచ్చని వారు పేర్కొన్నారు. అయితే, మనుషులపై ప్రయోగ పరీక్షలు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. 


More Telugu News