ఉదయం 10 తర్వాత అనవసరంగా బయట తిరిగారో వాహనం జప్తు: డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరిక

  • లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్న ప్రభుత్వం
  • గల్లీలు, కాలనీల్లో నిఘా పెంచాలని నిర్ణయం
  • 10 గంటలకే గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని ఆదేశం
తెలంగాణలో లాక్‌డౌన్‌ మరింత పటిష్ఠంగా అమలు కానుంది. ఉదయం 10 గంటలతో ప్రభుత్వం ఇచ్చిన సడలింపు ముగియనున్నప్పటికీ పని లేకున్నా వాహనాలపై బయటకు వచ్చే వారి పని పట్టాలని పోలీసులు నిర్ణయించారు. ఇకపై 10 గంటల తర్వాత బయటకు వచ్చే వారి వాహనాలను తాత్కాలికంగా జప్తు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాలనీలు, అంతర్గత రోడ్లలోనూ నిఘాను పెంచాలని సూచించారు.

10 గంటలకే అన్ని గస్తీ వాహనాలు సైరన్ మోగించాలని, ఉదయం ఆరు గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేలా చైతన్య పరచాలని సూచించారు. అలాగే, కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉండే చేపలు, కూరగాయల మార్కెట్లలో రద్దీని తగ్గించేందుకు ఆయా శాఖల అధికారులతో కలిసి వికేంద్రీకరణ దిశగా చర్యలు చేపట్టాలని డీజీపీ సూచించారు.


More Telugu News