సింగపూర్ వేరియంట్ ఎక్కడుంది?: కేజ్రీవాల్ పై సింగపూర్ మంత్రి ఆగ్రహం

  • సింగపూర్ లో చిన్నారులకూ కరోనా వైరస్
  • సింగపూర్ వేరియంట్ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు
  • మండిపడుతున్న సింగపూర్ వర్గాలు
  • నేతలు వాస్తవాలు మాట్లాడాలన్న విదేశాంగ మంత్రి
సింగపూర్ లో చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్న నేపథ్యంలో, అక్కడ వ్యాపిస్తున్నది సింగపూర్ వేరియంట్ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం తెలిసిందే. దీనిపై సింగపూర్ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్ వ్యాఖ్యలను సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. తాజాగా, ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ కూడా స్పందించారు. రాజకీయనేతలు వాస్తవాలకు కట్టుబడి మాట్లాడాలని కేజ్రీవాల్ కు హితవు పలికారు. సింగపూర్ వేరియంట్ అనేది ఎక్కడా లేదని స్పష్టం చేశారు.

అంతేకాకుండా, నేచుర్ డాట్ కామ్ లో వచ్చిన ఓ కథనం తాలూకు లింకును కూడా బాలకృష్ణన్ పంచుకున్నారు. భారత్ లో వ్యాపిస్తోన్న కరోనా వేరియంట్ల వివరాలను ఈ కథనంలో పేర్కొన్నారు. భారత్ లో బి.1.1.7, బి.1.617, బి.1.618 వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్టు వివరించారు. ఈ నేపథ్యంలో సింగపూర్ విదేశాంగ మంత్రి ఢిల్లీ సీఎం వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టారు. ఎక్కడుంది సింగపూర్ వేరియంట్? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.


More Telugu News