తౌతే బీభత్సం: ఓఎన్జీసీ నౌక పీ305లోని 14 మంది మృతి

  • తుపాను ధాటికి రెండ్రోజుల క్రితం కొట్టుకుపోయిన వైనం
  • 184 మందిని కాపాడిన నేవీ సిబ్బంది
  • తెలియరాని మిగతా వారి ఆచూకీ
  • మిగతా మూడు ఓడల్లోని వారు సురక్షితం
తౌతే తుపాను బీభత్సానికి అరేబియా సముద్రంలో కొట్టుకుపోయిన ఓఎన్జీసీ నౌక పీ305లోని 14 మంది సిబ్బంది చనిపోయారు. సముద్రంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు నేవీ సహాయ చర్యలు చేపట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. రెండ్రోజుల క్రితం 273 మంది సిబ్బందితో కూడిన పీ305 తుపానుకు కొట్టుకుపోయింది.

ఇప్పటిదాకా ఆ నౌకలోని 184 మందిని కాపాడామని పశ్చిమ నౌకాదళ కమాండ్ ఆపరేషన్స్ కమాండర్ ఎంకే ఝా చెప్పారు. 14 మంది చనిపోయారని, వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు. ఆ నౌకలోని మిగతా వారి ఆచూకీ తెలియాల్సి ఉందని, వారి కోసమూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఆపరేషన్ చేస్తున్నామని నేవీ అధికారి ఒకరు చెప్పారు. వారు బతికే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, నేవీ కాపాడిన 184 మంది సిబ్బందిలోని 125 మందితో ఐఎన్ఎస్ కొచ్చి బుధవారం ముంబై తీరానికి చేరింది. గాల్ కన్ స్ట్రక్టర్ లోని 137 మంది సిబ్బందినీ నిన్ననే భారత నౌకాదళం కాపాడింది. కొట్టుకుపోయిన మరో రెండు నౌకల్లోని 297 మంది సురక్షితంగా ఉన్నారు.


More Telugu News