అమెరికాలో భార్య‌ను వేధించిన భార‌తీయుడికి జైలు శిక్ష‌తో పాటు దేశ బ‌హిష్క‌ర‌ణ‌!

  • భార్య‌ను అప‌హ‌రించి, కారులో న‌ర‌కం చూపిన భ‌ర్త సునీల్
  • అనంత‌రం సాక్ష్యాల‌ను నాశ‌నం చేసే ప్ర‌య‌త్నం
  • అనంత‌రం భార‌త్‌లోని కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్
  • కేసును ఉప‌సంహ‌రించుకునేలా చేయాల‌ని విజ్ఞప్తి
  • గ‌త ఏడాది న‌వంబ‌రులో దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు
భార్య‌ను అప‌హ‌రించి, వేధింపుల‌కు గురి చేసిన నేరం కింద అమెరికాలో ఓ ప్ర‌వాస భార‌తీయుడికి 56 నెల‌ల జైలు శిక్ష‌, మూడేళ్లు ప్ర‌త్యేక పెరోల్‌తో కూడిన శిక్ష ప‌డింది. అంతేకాదు, ఆయా శిక్షా కాలాలు ముగిసిన త‌ర్వాత దేశాన్ని విడిచి పెట్టి తిరిగి భార‌త్‌కు వెళ్లి పోవాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు.

సునీల్ కె. ఆకుల (32) అనే వ్య‌క్తిని భార్య‌ను వేధించిన కేసుతో పాటు, సాక్ష్యాల‌ను నాశ‌నం చేసే ప్ర‌య‌త్నం చేసిన కేసులో గ‌త ఏడాది న‌వంబ‌రులో కోర్టు దోషిగా తేల్చుతూ  తీర్పు నిచ్చింది. ఈ కేసులో సునీల్‌కు తాజాగా శిక్ష విధించింది. భార్య‌తో విభేదాల కార‌ణంగా ఆమెకు దూరంగా టెక్సాస్‌లో ఉంటోన్న‌ సునీల్‌ 2019, ఆగ‌స్టు 6న అగ‌వాంలో ఓ అపార్ట్‌మెంట్ లో ఉంటోన్న‌ త‌న భార్య‌ వ‌ద్ద‌కు వెళ్లి గొడ‌వ పెట్టుకున్నాడు.

అనంత‌రం ఆమెను వేధింపుల‌కు గురి చేసి, బ‌లవంతంగా ఆమెను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. త‌న‌తో పాటు టెక్సాస్‌లోని త‌న ఇంటికి తిరిగి  తీసుకెళ్తున్నాన‌ని ఆమెకు చెప్పాడు. అయితే, కారులో ఆమెను ప‌లు ప్రాంతాల్లో తిప్పుతూ ఆమెను అందులోనే వేధింపుల‌కు గురి చేశాడు. ఆమె ప‌ని చేస్తోన్న కార్యాల‌యానికి రాజీనామా లేఖ పంపేలా చేశాడు.

అనంత‌రం ఆమె ల్యాప్‌టాప్‌ను ధ్వంసం చేసి, దాన్ని ర‌హ‌దారి ప‌క్క‌న ప‌డేశాడు. చివ‌ర‌కు కారును క్నాక్స్ కౌంటీలోని టెన్నెస్సీ హోట‌ల్ వ‌ద్ద ఆపి త‌న భార్య‌ను మ‌ళ్లీ కొట్టాడు. చివ‌ర‌కు ఈ విష‌యంపై స‌మాచారం అందుకున్న పోలీసులు హోట‌ల్ వ‌ద్దే సునీల్‌ను అరెస్టు చేసి దర్యాప్తు జ‌రిపారు.

దర్యాప్తు స‌మ‌యంలో భార‌త్‌లోని త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఫోన్లు చేసిన సునీల్ త‌న భార్య తండ్రితో మాట్లాడి కేసును ఉప‌సంహ‌రించుకునేలా న‌చ్చ‌జెప్పాల‌ని కోరాడు. చివ‌ర‌కు అత‌డికి కోర్టు శిక్ష విధించింది.


More Telugu News