తుపాను ధాటికి చెట్లు కూలిపోయాయి.. ముంబైలోని నా కార్యాల‌యం జ‌ల‌మ‌యం: అమితాబ్ బ‌చ్చ‌న్

  • తౌతే పెను తుపాను కార‌ణంగా ముంబైలో భారీ వ‌ర్షాలు
  • అనేక ఇళ్లు, కార్యాల‌యాలు జ‌ల‌మ‌యం
  • సిబ్బందికి తన టీ షర్ట్స్‌ తీసిచ్చానన్న అమితాబ్  
తౌతే పెను తుపాను కార‌ణంగా ముంబైలో భారీ వ‌ర్షాలు కురిశాయి. దీంతో అనేక ఇళ్లు, కార్యాల‌యాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు అమితాబ్‌ బచ్చన్ కార్యాల‌యం కూడా  జలమయం కావ‌డంతో అందులోని సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ విష‌యాన్ని అమితాబ్ త‌న బ్లాగ్ ద్వారా తెలిపారు. తుపాను మధ్యలో అంతా నిశ్శబ్దంగా ఉందని, ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉందని ఆయ‌న రాసుకొచ్చారు. వ‌ర్షాల ధాటికి చెట్లు కూలిపోయాయ‌ని, వరద నీరు ముంబైలోని త‌న‌ ఆఫీసును ముంచెత్తిందని తెలిపారు.

ఆ కార్యాల‌యం మీద కప్పిన ప్లాస్టిక్‌ కవర్‌ షీట్లు వేగంగా వీస్తున్న గాలుల వల్ల కొట్టుకుపోయాయని పేర్కొన్నారు. అక్క‌డి షెడ్డు కూడా పాక్షికంగా ధ్వంసం అయిందని వివ‌రించారు. త‌న కార్యాల‌య సిబ్బంది తడిసిపోయిన‌ప్ప‌టికీ మరమ్మతు ప‌నులు చేస్తూనే ఉన్నారని ఆయ‌న చెప్పారు.

దీంతో వారికి త‌న‌ వార్డ్‌రోబ్‌ నుంచి టీ షర్ట్స్‌ తీసిచ్చానని తెలిపారు. అమితాబ్ బ‌చ్చ‌న్ ప‌లు సినిమాల్లో న‌టిస్తూ ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. త‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను బ్లాగ్‌, సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా బిగ్ బీ ఎప్ప‌టిక‌ప్పుడు వివ‌రిస్తుంటారు.


More Telugu News