ఏప్రిల్‌లో రెండంకెలకు ఎగబాకిన టోకు ద్రవ్యోల్బణం

  • పెరిగిన ముడి చమురు, తయారీ వస్తువుల ధరలు
  • జీవనకాల గరిష్ఠానికి డబ్ల్యూపీఐ
  • కొవిడ్‌ నేపథ్యంలో పెరిగిన ప్రొటీన్ ఆధారిత ఆహార పదార్థాల ధరలు
  • పప్పులు 10.74%, పండ్లు 27.43% ప్రియం
ముడి చమురు, ఉత్పత్తి ఆధారిత వస్తువుల ధరల పెరుగుదలతో ఏప్రిల్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) జీవనకాల గరిష్ఠానికి చేరుకుంది. గత నెల డబ్ల్యూపీఐ 10.49 శాతానికి ఎగబాకింది. మార్చిలో ఈ సూచీ 7.39 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే నెలలో (మైనస్‌) -1.57గా నమోదైంది.

కరోనా రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో ఏప్రిల్‌లో మాంసం, గుడ్లు, చేపలకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వీటి ధరలు 10.88 శాతం ఎగబాకాయి. ఇక మొత్తం ఆహార పదార్థాల ధరలు 4.92 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు మాత్రం తగ్గడం గమనార్హం. ఇక పప్పుల ధరలు 10.74 శాతం, పండ్ల ధరలు 27.43 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్తు రంగంలో ద్రవ్యోల్బణం 20.94 శాతంగా నమోదైంది. తయారీ వస్తువుల ధరలు 9.01 శాతం పెరిగాయి.


More Telugu News