గోప్యతా విధానాలకు ఒప్పుకోకుంటే ఖాతా డిలీట్​: తేల్చి చెప్పిన వాట్సాప్​

  • నూతన విధానాలపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
  • మే 15 డెడ్ లైన్ లో మార్పులు లేవన్న వాట్సాప్
  • భారత చట్టాలను అనుసరించాలన్న ఏఎస్జీ
  • దానిపై ప్రకటన చేయబోమన్న సంస్థ
తమ గోప్యతా విధానాలకు ఒప్పుకోకుంటే వినియోగదారుల ఖాతాలను తొలగించేస్తామని వాట్సాప్ తేల్చి చెప్పింది. అందుకు విధించిన మే 15 గడువులో ఎలాంటి మార్పులూ చేయబోమని స్పష్టం చేసింది. వాట్సాప్ నూతన గోప్యతా విధానాలను సవాల్ చేస్తూ సీమా సింగ్, లా విద్యార్థి చైతన్య రోహిలా వేసిన పిటిషన్ పై ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.

ఈ క్రమంలోనే సంస్థ విధానాల్లో ఎలాంటి మార్పులు లేవని వాట్సాప్ తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టుకు వివరించారు. తమ విధానాలకు అంగీకరించని యూజర్ల ఖాతాలను ఒక్కొక్కటిగా తొలగిస్తామని పేర్కొన్నారు. వాట్సాప్ అప్ డేట్ చేసిన విధానాల ప్రకారం వినియోగదారుల ఇంటరాక్షన్స్ (చాటింగ్)కు సంబంధించిన కొంత సమాచారాన్ని ఫేస్ బుక్ కు చెందిన బిజినెస్ అకౌంట్లకు అందించనుంది.

అయితే, భారత చట్టాలను అనుసరించే ఏదైనా చేస్తామంటూ సంస్థ నుంచి ధ్రువీకరణ ఇప్పించాల్సిందిగా కోర్టును ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) చేతన్ శర్మ కోరారు. నూతన గోప్యతా విధానాల పర్మిషన్స్ నుంచి వైదొలిగినా ఖాతాలు లేదా ఆ ఖాతాకు సంబంధించిన డేటాను తొలగించకుండా ఉంచే స్టేటస్ కోను పాటించేలా చూడాలన్నారు.

దానికి వాట్సాప్ అంగీకరించలేదు. ప్రభుత్వం కోరుతున్నట్టు అలాంటి ప్రకటనలేవీ చేయబోమని వాట్సాప్ తరఫున కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. అందరి వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు.. తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.


More Telugu News