భారత్‌, యూకే వేరియంట్లపైనా పనిచేస్తున్న కొవాగ్జిన్‌!

  • ప్రకటించిన భారత్‌ బయోటెక్‌
  • బి.1.167, బి.1.1.7 రకాలను సమర్థంగా ఎదుర్కొంటున్న టీకా
  • ప్రయోగాలు నిర్వహించి ధ్రువీకరించిన సంస్థ
  • అధ్యయన పత్రాన్ని పంచుకున్న సుచిత్ర ఎల్లా
దేశీయంగా తాము తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా భారత్‌లో ప్రబలంగా ఉన్న బి.1.167 కరోనా రకంతో పాటు యూకే వేరియంట్‌గా భావిస్తున్న బి.1.1.7 రకంపైనా సమర్థంగా పనిచేస్తోందని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఈ మేరకు వారు జరిపిన అధ్యయన ఫలితాల సారాంశాన్ని ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురించింది. ఈ రెండు రకాలను సమర్థంగా ఎదుర్కోగలిగే యాంటీబాడీలు కొవాగ్జిన్‌ టీకా వల్ల ఉత్పత్తవుతున్నాయని పేర్కొంది. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాన్ని సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్లా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  

దేశీయంగా అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన టీకాల్లో కొవాగ్జిన్‌ ఒకటి. అయితే, భారత్‌తో పాటు వివిధ దేశాల్లో వెలుగులోకి వస్తున్న కరోనా రకాలపై టీకాలు ఏ మేర పనిచేస్తాయన్న దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్‌ బయోటెక్‌ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు భారత్‌లో కరోనా రెండో దశ ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్న తరుణంలో ఈ అప్‌డేట్‌ రావడం ఊరట కలిగించే అంశం.


More Telugu News