కంటి వైద్యుడ్నంటూ పెళ్లి పేరిట రూ.9 లక్షలకు టోకరా!

  • నిండా మోసపోయిన సికింద్రాబాద్ మహిళ
  • కొంతకాలం కిందట భర్తను పోగొట్టుకున్న వైనం
  • మళ్లీ పెళ్లి చేసుకోవాలని సూచించిన తల్లిదండ్రులు
  • మ్యాట్రిమొనీకి వివరాల అప్పగింత
  • మారుపేరుతో పరిచయం చేసుకున్న మోసగాడు
  • గిఫ్టు పంపానంటూ చీటింగ్
పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ వ్యక్తి చేతిలో సికింద్రాబాద్ కు చెందిన ఓ మహిళ సులువుగా మోసపోయింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సదరు మహిళ కొంతకాలం కిందట భర్తను కోల్పోయింది. మళ్లీ పెళ్లి చేసుకుంటే జీవితానికి ఓ ఆలంబన దొరుకుతుందని తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో, తన వివరాలను ఓ మ్యాట్రిమొనీ సంస్థకు ఇచ్చారు. ఆమె వివరాలను మ్యాట్రిమొనీ వెబ్ సైట్లో చూసిన ఓ వ్యక్తి మోసానికి తెరలేపాడు. ఆ మహిళతో పరిచయం ఏర్పరుచుకున్నాడు.

తన పేరు క్లిఫర్డ్ అని, తాను స్కాట్లాండ్ లో కంటి వైద్యుడ్నని నమ్మించాడు. తన పూర్వీకులు పంజాబ్ కు చెందినవారని తెలిపాడు. అయితే, తల్లి కోరిక కాదనలేక దక్షిణ భారతదేశానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ మహిళతో చెప్పాడు. ఇటీవల ఆ మహిళకు ఫోన్ చేసిన అవతలి వ్యక్తి... పెళ్లి కోసం గోల్డ్, డైమండ్ నెక్లెస్ గిఫ్టుగా పంపుతున్నానని, శంషాబాద్ విమానాశ్రయంలో ఆ పార్శిల్ ను విడిపించుకోవాలంటే నగదు చెల్లించాల్సి ఉంటుందని వివరించాడు.

అతను చెప్పినట్టే బాధితురాలు పలు విడతల్లో రూ.9 లక్షల వరకు చెల్లించారు. ఎంతకీ పార్శిల్ రాకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి లబోదిబోమన్నారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News