యాదాద్రి గర్భాలయ విమాన గోపురానికి పసిడి వన్నెలు.. 60 కిలోల బంగారంతో తాపడం

  • రూ. 40 కోట్ల వ్యయంతో 60 కిలోల బంగారంతో తాపడం
  • భక్తుల నుంచి పసిడి కానుకలను స్వీకరించే యోచన
  • తిరుమల తిరుపతి దేవస్థానం శిల్పకళా కేంద్రానికి పనులు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహాలయం స్వర్ణ కాంతులతో వెలుగులీననుంది. క్షేత్రంలోని స్వయంభూ పాంచనరసింహులు కొలువైన కొండగుహ గర్భాలయ విమాన గోపురం పసిడి కాంతులతో తళుకులీననుంది. స్వామివారి విమాన గోపురానికి రూ. 40 కోట్ల వ్యయంతో 60 కిలోల బంగారాన్ని ఉపయోగించి తాపడం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బంగారం సేకరణ, పనుల కేటాయింపునకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.

తాపడం పనుల్లో భక్తులను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. ఇందుకోసం భక్తుల నుంచి బంగారం కానుకలను స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. పనుల పర్యవేక్షణ కోసం వైటీడీఏ చైర్మన్ జి.కిషన్‌రావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆలయ విమాన గోపురాలకు స్వర్ణ తాపడం చేయడంలో అనుభవం కలిగిన తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయ శిల్పకళా కేంద్రానికి ఈ పనులు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


More Telugu News