కరోనాతో బాధపడుతూ... ఆసుపత్రి ఫ్లోర్ ను శుభ్రంగా తుడిచిన మిజోరం మంత్రి

  • కరోనా బారినపడిన మిజోరం విద్యుత్ శాఖ మంత్రి
  • భార్య, కుమారుడికి సైతం కరోనా పాజిటివ్
  • అందరికీ ఒకే ఆసుపత్రిలో చికిత్స
  • గది అపరిశుభ్రంగా ఉందని భావించిన మంత్రి
  • స్వీపర్ కు ఫోన్ చేస్తే స్పందన కరవు
  • స్వయంగా రంగంలోకి దిగిన మంత్రి
మిజోరం విద్యుత్ శాఖ మంత్రి ఆర్. లాల్ జిర్లియానా తన చర్యతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. లాల్ జిర్లియానా ఇటీవలే కరోనా బారినపడ్డారు. ఐజ్వాల్ లోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన భార్య, కుమారుడికి సైతం కరోనా పాజిటివ్ రాగా, అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, మంత్రి లాల్ జిర్లియానా తాను చికిత్స పొందుతున్న గది అపరిశుభ్రంగా ఉండడం గమనించి ఆసుపత్రి పారిశుద్ధ్య సిబ్బందికి ఫోన్ చేశారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తానే నడుం బిగించారు. తన గదిలో ఫ్లోర్ ను శుభ్రంగా తుడిచారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

అవసరమైనప్పుడు ఇలాంటి పనులు తప్పదని, తనకు ఇవి కొత్తేం కాదని లాల్ జిర్లియానా అన్నారు. తాను మంత్రినైనా, ఎవరికంటే అధికుడ్నని భావించడంలేదని వివరించారు. స్వీపర్ కు ఫోన్ చేస్తే, సమాధానం రాకపోవడంతో తానే గదిని శుభ్రం చేశానని వెల్లడించారు. అయితే ఇది ఆసుపత్రి సిబ్బందిని ఇబ్బందికి గురిచేయాలని తీసుకున్న నిర్ణయం కాదని, ఇతరులకు తానొక ఉదాహరణగా నిలవాలన్న ఉద్దేశంతోనే గది తుడిచానని లాల్ జిర్లియానా వివరణ ఇచ్చారు.


More Telugu News