'తౌతే' అంటే ఏమిటో తెలుసా..?

  • అరేబియా సముద్రంలో 'తౌతే' తుపాను
  • గుజరాత్ దిశగా కదులుతున్న తుపాను
  • తుపానుకు నామకరణం చేసిన మయన్మార్
  • 'తౌతే' అంటే బర్మా భాషలో గోల చేసే బల్లి అని అర్థం
అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానును 'తౌతే' (Tauktae) అని పేర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేరళ తీరానికి సమీపంలో ఉన్న 'తౌతే' ఈ నెల 18న గుజరాత్ తీరాన్ని తాకనుంది. అయితే, ఈ తుపానుకు పేరుపెట్టే అవకాశం ఈసారి మయన్మార్ కు లభించింది. మయన్మార్ వాతావరణ విభాగం తమ దేశంలో ప్రత్యేకంగా ఉండే బల్లి పేరును తుపానుకు పెట్టింది. బర్మా భాషలో 'తౌతే' అంటే 'అధికంగా ధ్వనులు చేసే బల్లి' అని అర్థం.

ఆసియా ప్రాంతంలో ఏర్పడే తుపానులకు నామకరణం చేసే అవకాశం ఆయా దేశాలకు వంతుల వారీగా దక్కుతుంది. ఈ నామకరణ కార్యక్రమాన్ని వరల్డ్ మెటియరోలాజికల్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (డబ్ల్యూఎంఓ/ఈఎస్ సీఏపీ), పానెల్ ఆన్ ట్రాపికల్ సైక్లోన్స్ (పీటీసీ) సంస్థలు పర్యవేక్షిస్తుంటాయి. ఇందులో సభ్యదేశాలుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్ లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏనీ, యెమెన్ దేశాలున్నాయి. 2004 నుంచి ఈ ప్రాంతంలో తుపానులకు నామకరణం చేసే విధానం అమలు చేస్తున్నారు.


More Telugu News