టైఫాయిడ్ సోకితే కరోనా అనుకుని.. ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

  • విజయనగరం జిల్లా నల్లబిల్లిలో ఘటన
  • పురుగు మందును ఓఆర్ఎస్‌లో కలిపి తాగి బావిలో దూకిన వైనం
  • గ్రామంలో విషాదం
విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. టైఫాయిడ్ వస్తే కరోనా సోకిందని భయపడి ఓ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. వేపాడ మండలంలోని నల్లబిల్లిలో నిన్న జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62) రెండు సంవత్సరాలుగా  విశాఖపట్టణం జిల్లాలోని చోడవరంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు.

గుప్తాకు భార్య సత్యవతి (57), అత్త వెంకటసుబ్బమ్మ, కుమారుడు సంతోష్, కుమార్తె పూర్ణ ఉన్నారు. కుమారుడు తెలంగాణలోని నిజామామాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాడు. కుమార్తెకు వివాహమైంది. 2002లో తన మొదటి భార్య మరణించడంతో, 2009లో ఓ పేపరు ప్రకటన చూసి గుంటూరుకు చెందిన సత్యవతిని గుప్తా రెండో వివాహం చేసుకున్నాడు.

కాగా, ఇటీవల సత్యనారాయణ అనారోగ్యానికి గురవడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకుంటే టైఫాయిడ్ అని తేలింది. దీంతో మందులు వాడుతున్నారు. అయితే, రెండు రోజుల క్రితం భార్య సత్యవతికి కూడా జ్వరం వచ్చింది. దీంతో వారికి సేవలు చేసేందుకు చుక్కపల్లిలో ఉంటున్న కుమార్తె వచ్చింది. గురువారం కుమార్తెను ఇంటికి వెళ్లిపొమ్మన్న గుప్తా.. నిన్న ఉదయం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు.

తమకు కరోనానే వచ్చిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని శివాలయం వెనక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్ఎస్‌లో కలిపి ముగ్గురూ తాగారు. అనంతరం సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు బావి నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News