ఏపీకి చేరుకున్న మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు

  • పూణే నుంచి గన్నవరం చేరిక
  • వ్యాక్సిన్ స్టోరేజ్ యూనిట్ కు తరలింపు
  • ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు కేటాయింపు
  • ఏపీకి కొద్దిమేర ఉపశమనం
కరోనా వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న ఏపీకి ఊరట కలిగింది.  మరో 4.8 లక్షల కొవిషీల్డ్ డోసులు ఇవాళ రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ డోసులను పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. వీటిని తొలుత గన్నవరంలోని వ్యాక్సిన్ స్టోరేజి యూనిట్ లో భద్రపరుస్తారు. ఆరోగ్యశాఖ ఆదేశాలపై ఈ కొవిషీల్డ్ డోసులను జిల్లాలకు తరలిస్తారు.

కొత్తగా వచ్చిన టీకా డోసులతో రాష్ట్రంలో టీకాల కొరత నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. వ్యాక్సిన్ల కొరతతో ఏపీలో సోమ, మంగళవారాల్లో చాలా జిల్లాల్లో వ్యాక్సినేషన్ జరగలేదు. తాజా డోసులు వచ్చిన నేపథ్యంలో రెండో డోసు వారికి పూర్తి చేయాలని అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

కాగా, పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసేందుకు ఏపీ సర్కారు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ టెండర్ల ద్వారా రాష్ట్రానికి అవసరమైనన్ని వ్యాక్సిన్ డోసులు పొందేందుకు వీలవుతుందని సర్కారు భావిస్తోంది.


More Telugu News