వారెంట్ లేకుండా మా నాన్నను అరెస్ట్ చేశారు... ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు: రఘురామ తనయుడు భరత్

  • రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • వాహనంలో తరలింపు
  • అన్యాయంగా తీసుకెళ్లారన్న భరత్
  • అధికారం ఉంటే ఏమైనా చేస్తారా అంటూ ఆక్రోశం
  • తన తండ్రి ఆరోగ్యం బాగా లేదని ఆవేదన
వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును కొద్దిసేపటి కిందట ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ స్పందించారు.

వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. అరెస్ట్ కు కారణాలు చూపలేదని, తాము అడిగితే కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారని భరత్ వెల్లడించారు. "పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు, మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారం చేతిలో ఉంది కదా అని ఏమైనా చేస్తారా? అని ఆక్రోశించారు. కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారు? అని ప్రశ్నించారు. తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని భరత్ వాపోయారు. ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది మూడు నెలల కిందటేనని వెల్లడించారు. తమ ఇంటికి వచ్చింది మఫ్టీలో ఉన్న పోలీసులా, రౌడీలా అనేది అర్థంకాలేదని అన్నారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారమే వచ్చి, అకస్మాత్తుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారని ఆరోపించారు. కనీసం న్యాయవాదితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ అరెస్ట్ అన్యాయం అని, కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు.

కాగా, రఘురామకృష్ణరాజుపై 124/ఏ, 153/బీ, 505 ఐపీసీ, 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం. సెక్షన్ 50 కింద రఘురామ భార్య రమాదేవికి సీఐడీ నోటీసులు ఇచ్చింది.


More Telugu News