సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే!

  • సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సులను నిలిపివేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
  • హైకోర్టులో పిటిషన్లు.. నేటి విచారణలో ఏపీ సర్కారు ఇంప్లీడ్
  • తెలంగాణ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అంబులెన్సులు ఆపొద్దని స్పష్టీకరణ
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాల ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుండడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏపీ నుంచి కరోనా రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాదు వెళుతుండగా, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం పోలీసుల సాయంతో అంబులెన్సులను నిలిపివేస్తోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదంటూ తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అంబులెన్సులను ఆపొద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.

కాగా, నేటి విచారణలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి తమ వాదనలు వినిపించింది. ఏపీ సర్కారు తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇతర రాష్ట్రాల వాహనాలను అడ్డుకుంటే అది ఆర్టికల్ 14 ఉల్లంఘనే అని ఏజీ వాదించారు. అందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ... తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాము వ్యవహరిస్తున్నామని, ఇతర రాష్ట్రాల వారు వస్తే కరోనా మరింత ప్రబలే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది.

అయితే, తెలంగాణ హైకోర్టు ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై సానుకూలంగా స్పందించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రోగుల సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించవచ్చని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ను నిలుపుదల చేసిన హైకోర్టు... అంబులెన్సులను ఆపేందుకు వీల్లేదని తెలంగాణ పోలీసు శాఖకు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం పాత సర్క్యులర్ లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్ ఇవ్వాలని ఆదేశించింది.


More Telugu News