తెలంగాణకు చెడ్డపేరు తీసుకురావద్దు... ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను  అనుమతించాలి: జగ్గారెడ్డి

  • సరిహద్దుల్లో ఏపీ అంబులెన్సుల నిలిపివేత
  • తెలంగాణ సర్కారుపై విమర్శలు
  • స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
  • ప్రజల ఇబ్బందులు గమనించాలని హితవు
తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను నిలిపివేస్తుండడం తీవ్ర వివాదంగా రూపుదాల్చుతోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తెలంగాణ సర్కారు వైఖరిని బాహాటంగా విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఏపీ నుంచి వచ్చే కరోనా రోగుల అంబులెన్సులను కేసీఆర్ సర్కారు అనుమతించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి చెడ్డపేరు తీసుకువచ్చే చర్యలు విడనాడాలని హితవు పలికారు. ప్రజల ఇబ్బందులను తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

కరోనాను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆక్సిజన్, రెమ్ డెసివిర్, వెంటిలేటర్ల కొరతతో ప్రజలు మృత్యువాత పడుతున్నారని వివరించారు. రెమ్ డెసివిర్ అందుబాటులో ఉండేలా కేటీఆర్ చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు.

ఇక మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందిస్తూ, అది తమకు సంబంధించిన అంశం కాదన్నారు. ఈటల ఎపిసోడ్ టీఆర్ఎస్ పార్టీ ఇంటి విషయం అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు.


More Telugu News