అరేబియా సముద్రంలో 'తౌతే '... రుతుపవనాల రాకకు శుభసంకేతం!

  • వాయుగుండంగా బలపడిన అల్పపీడనం
  • ఈ నెల 16న గుజరాత్ వద్ద తీరాన్ని తాకే అవకాశం
  • పలు రాష్ట్రాలు, లక్షద్వీప్ కు వర్షసూచన
  • గుజరాత్ కు కుంభవృష్టి, పెనుగాలుల హెచ్చరిక
  • ఏపీపై 'తౌతే' ప్రభావం పాక్షికం
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ ఉదయం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్ కు పశ్చిమ నైరుతి దిశగా 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడి ఈ నెల 16న తుపానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని 'తౌతే' అని పిలుస్తారు. 'తౌతే' తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్ లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ నివేదికలో పేర్కొన్నారు. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదని హెచ్చరించారు. తౌతే ప్రభావం ఏపీపై పాక్షికంగా ఉంటుందని తెలిపారు. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.

జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్ అంచనాలకు తగ్గట్టుగానే వర్షపాతాన్ని ఇస్తుందని పలు వాతావరణ సంస్థలు ముందస్తు నివేదికల్లో వెల్లడించాయి.


More Telugu News