మన రాష్ట్రంలో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకి ఎందుకు వెళతారు?: నారా లోకేశ్ విసుర్లు

  • అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సుల నిలిపివేత
  • ఏపీ సర్కారుపై లోకేశ్ ఆగ్రహం
  • ప్రజలు మెరుగైన చికిత్స కోసమే హైదరాబాదు వెళతారని వ్యాఖ్యలు
  • కేసీఆర్ కు జగన్ ఫోన్ చేయాలని సూచన
  • తెలంగాణ ప్రభుత్వం మానవతాదృక్పథం చూపాలని హితవు
ఏపీ, తెలంగాణ సరిహద్దుల వద్ద అంబులెన్సులను పోలీసులు నిలిపివేస్తుండడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ గారూ, మన రాష్ట్రంలో వైద్యం దొరికితే ప్రజలు తెలంగాణకి ఎందుకు వెళతారని విమర్శించారు. ఇక్కడుంటే ప్రాణాలు నిలవవు... వైద్యం కోసం పక్క రాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా లేదు అని వ్యాఖ్యానించారు.

"మీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకితే ఆగమేఘాలపై హైదరాబాద్ వెళ్లి అక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. అలాంటిది, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు హైదరాబాద్ వెళ్లే అవకాశం మాత్రం ఇప్పించలేరా? ఇంత చేతగాని దద్దమ్మ సీఎం ఏ రాష్ట్రానికీ ఉండకూడదు. తాడేపల్లి నివాసంలో ఎన్ని గంటలు నిద్రపోతారు కానీ, లేచి కేసీఆర్ గారికి ఫోన్ చేసి అనుమతులు తెప్పించండి" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కరోనా రోగుల అంబులెన్సులను అనుమతించాలని లోకేశ్ హితవు పలికారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారు మెరుగైన వైద్యం కోసమే హైదరాబాదు వస్తారని, తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితుల అంబులెన్సులను ఆపకుండా స్పష్టమైన ఆదేశాలివ్వాలని తెలిపారు. గోల్డెన్ అవర్స్ లోగా వారు ఆసుపత్రికి చేరగలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయని స్పష్టం చేశారు.


More Telugu News