ప్రయాణికులు లేక వెలవెల.. తెలుగు రాష్ట్రాల్లో ఆరు రైళ్ల రద్దు
- ఆంక్షలు, లాక్‌డౌన్ కారణంగా ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న జనం
- రద్దు చేసిన రైళ్లలో విశాఖ-కడప, విశాఖ-లింగంపల్లి, ముంబై-ఆదిలాబాద్ రైళ్లు
- పునరుద్ధరణ తేదీని ప్రకటించని రైల్వే
కరోనా లాక్‌డౌన్, ఇతర ఆంక్షల కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకుంటుండడంతో రైళ్లు బోసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఆరు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిన్న తాత్కాలికంగా రద్దు చేసింది. విశాఖపట్టణం-కడప (07488) రైలును నేటి నుంచి ఈ నెల 31 వరకు రద్దు చేయగా, కడప-విశాఖ రైలు (07487)ను రేపటి నుంచి జూన్ 1 వరకు రద్దు చేసింది. అలాగే, విశాఖ-లింగంపల్లి (02831), లింగంపల్లి-విశాఖ (02832) రైళ్లను రేపటి నుంచి వచ్చే నెల 1 వరకు నిలిపివేసింది. ముంబై సీఎస్‌టీ-ఆదిలాబాద్ (01141) ఎక్స్‌ప్రెస్‌ను 17వ తేదీ నుంచి, ఆదిలాబాద్-ముంబై సీఎస్‌టీ (01142) రైలును 18 నుంచి రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే, ఈ రైళ్లను తిరిగి ఎప్పటి నుంచి పునరుద్ధరించేదీ వెల్లడించలేదు.