చేతులెత్తేసిన ప్రతిపక్షాలు.. నేపాల్ ప్రధానిగా మళ్లీ ఓలి!

  • ఇటీవల విశ్వాస పరీక్షలో ఓటమి పాలైన కేపీశర్మ ఓలి
  • ప్రతిపక్ష జనతా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు కూడగట్టడంలో ప్రతిపక్షాలు విఫలం
  • నేడు ప్రధానిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్న ఓలి
ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిపక్షాలు విఫలమైన వేళ నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలి మళ్లీ నియమితులయ్యారు. నేడు ఆయన ప్రధానిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ పార్లమెంటులో  గత సోమవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ఓలి ఓటమి పాలయ్యారు. దీంతో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అయితే, ఓలిని గద్దె దించిన ప్రతిపక్షాలు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో విఫలమయ్యాయి. తీవ్ర తర్జనభర్జన అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ఇక తమ వల్ల కాదంటూ నిన్న తేల్చి చెప్పాయి.

271 స్థానాలున్న పార్లమెంటులో ఓలి సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్సీపీ) కి 121 మంది సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన నేపాలీ కాంగ్రెస్ అధినేత షేర్ బహదూర్ దేవ్ వా నివాసంలో నిన్న సమావేశమైన నేతలు.. ప్రతిపక్ష జనతా సమాజ్‌వాదీ పార్టీ మద్దతు తమకు లభించే అవకాశం లేదన్న నిర్ణయానికొచ్చారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని నిర్ణయించారు. మరోవైపు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు సెంటర్) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో అతి పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీ చీఫ్ అయిన కేపీ శర్మ ఓలిని  ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ ఆహ్వానించారు.


More Telugu News