ఆక్సిజన్ అవసరం మాకు తగ్గింది.. మిగులును వేరే రాష్ట్రాలకు ఇవ్వండి: కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

  • కేంద్రానికి లేఖ రాశామన్న డిప్యూటీ సీఎం
  • రోజువారీ అవసరం 582 టన్నులకు తగ్గిందని వెల్లడి
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని కామెంట్
  • ఢిల్లీలో తగ్గుముఖం పడుతున్న కొత్త కేసులు
ప్రస్తుతం తమ ఆక్సిజన్ అవసరాలు చాలా వరకు తగ్గిపోయాయని, మిగిలిన ఆక్సిజన్ ను వేరే రాష్ట్రాలకు ఇస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లోని ఆక్సిజన్ బెడ్లు ఖాళీ అవుతున్నాయని, చాలా వరకు ఆక్సిజన్ అవసరం తగ్గిందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వెల్లడించారు. 15 రోజుల క్రితం వరకు రోజూ 700 టన్నుల వరకు ఆక్సిజన్ అవసరం అయిందని, ఇప్పుడది 582 టన్నులకు తగ్గిందని పేర్కొన్నారు.

ఇదే విషయంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశామన్నారు. తమకు 582 టన్నులు కేటాయించి మిగతా మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిందిగా కోరామని చెప్పారు. ఆపత్కాలంలో ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ హైకోర్టుకు సిసోడియా కృతజ్ఞతలు తెలియజేశారు. ఢిల్లీలో నిన్న 10,400 కొత్త కేసులే నమోదయ్యాయని ఆయన చెప్పారు. అంతకుముందు రోజుతో పోలిస్తే 21 శాతం మేర తగ్గాయన్నారు. పాజిటివిటీ రేటు కూడా 14 శాతానికి పడిపోయిందన్నారు.


More Telugu News