మహారాష్ట్రలో జూన్​ 1 దాకా ఆంక్షల పొడిగింపు

  • లాక్ డౌన్ తరహా ఆంక్షలు అమలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆ రాష్ట్ర సీఎస్
  • పాల సేకరణ, రవాణాకు మినహాయింపు
కరోనా కట్టడి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ తరహా ఆంక్షలను పొడిగించింది. మహమ్మారి గొలుసుకట్టును తెంచేందుకు జూన్ 1 వరకు ఇప్పుడున్న ఆంక్షలే అమల్లో ఉంటాయని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారాం కుంతే ఉత్తర్వులు జారీ చేశారు. వేరే రాష్ట్రాలు, మహమ్మారి ముప్పున్న ప్రాంతాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ను సమర్పించాలని పేర్కొన్నారు.

పాలు, నిత్యావసరాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్ కు ఎలాంటి ఆంక్షలు ఉండవన్నారు. అయితే, వాటి అమ్మకాలు మాత్రం ఆంక్షలకు సడలింపులున్న సమయాల్లోనే చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్లు, ఏపీఎంసీల్లో కరోనా నిబంధనలను పాటించేలా స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.  

కరోనా కట్టడిలో అవసరమైన ఔషధాలు, పరికరాల రవాణాలో భాగంగా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు స్థానిక రవాణా సదుపాయాలు ఉపయోగించుకోవచ్చని, మోనో, మెట్రోల్లో ప్రయాణాలు చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.


More Telugu News