ఎవరెస్ట్​ పై ఇద్దరు విదేశీ పర్వతారోహకుల మృతి

  • కొద్ది దూరం వెళ్లి మరొకరి మృత్యువాత
  • స్విట్జర్లాండ్, అమెరికా దేశస్థులుగా గుర్తింపు
  • ఈ ఏడాది తొలి సీజన్ లో తొలి మరణాలు
  • వారంలో 30 మందికి అనారోగ్యం
ఎవరెస్ట్ శిఖరంపై అమెరికా, స్విట్జర్లాండ్ కు చెందిన ఇద్దరు పర్వతారోహకులు చనిపోయారు. దీంతో ఈ ఏడాది తొలి సీజన్ లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరంపై తొలి మరణాలు నమోదయ్యాయని నేపాల్ ప్రకటించింది. ఆ ఇద్దరు పర్వతారోహకులు బుధవారం చనిపోయారని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ కు చెందిన మింగ్మ షెర్పా చెప్పారు.

స్విట్జర్లాండ్ కు చెందిన ట్రెక్కర్ శిఖరం అంచులకు చేరాడని, అయితే, అక్కడకు వెళ్లాక ఊపిరాడక చనిపోయాడని అదే సంస్థకు చెందిన ఛాంగ్ దావా షెర్పా చెప్పారు. అతడితో పాటు అదనంగా ఇద్దరు షెర్పాలను, వారితో పాటు ఆక్సిజన్, ఆహారాన్ని పంపించామన్నారు. అయినా దురదృష్టవశాత్తూ అతడిని బతికించలేకపోయామన్నారు.

అమెరికా ట్రెక్కర్ హిల్లరీ స్టెప్ లోని క్యాంప్ 4 వరకు వెళ్లి ఇబ్బంది పడడంతో వెంటనే వెనక్కు తీసుకొచ్చామన్నారు. అతి శీతల వాతావరణంతో అతడికి చూపు మందగించిందని, ఊపిరాడలేదని చెప్పారు. అనంతరం మరణించాడన్నారు. కాగా, గత వారం రోజుల్లో 30 మందికి పైగా ఎవరెస్ట్ పై అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో వారందరినీ వెంటనే బేస్ క్యాంప్ కు తరలించారు. ఇద్దరికే కరోనా పాజిటివ్ గా తేలింది.

ఇటీవలి కాలంలో ఎవరెస్ట్ పైకి ఎక్కువ మందిని అనుమతించడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో పర్వతారోహకుల ఉద్ధృతిని తగ్గించేందుకు నేపాల్ ప్రభుత్వం.. ఎవరెస్ట్ ఎక్కే పర్వతారోహకుల సంఖ్యపై పరిమితిని విధించింది. గత ఏడాది సీజన్ అంతా కరోనా మహమ్మారి వల్ల రద్దయిపోయింది. పర్యాటకులు, పర్వతారోహకులను ఆకర్షించేందుకుగానూ నేపాల్ ప్రభుత్వం క్వారంటైన్ నిబంధనలను సడలించింది. ఇప్పుడిప్పుడే అక్కడ పర్యాటకం పుంజుకుంటోంది.


More Telugu News