రుయా మృతులు 31 మంది.. వివరాలు విడుదల చేసిన టీడీపీ

  • మరో 10 నుంచి 15 మంది వివరాలు కూడా సేకరిస్తున్నాం
  • రుయా దుర్ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
  • బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారమివ్వాలి
తిరుపతిలోని రుయా ఆసుపత్రి మృతులు 11 మంది కాదని, వాస్తవ మృతుల సంఖ్య 31 మందని టీడీపీ పేర్కొంది. కానీ ప్రభుత్వం మాత్రం 11 మందే చనిపోయారని ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము చెబుతున్న 31 మంది మాత్రమే కాక మరో 10 నుంచి 15 మంది వరకు చనిపోయి ఉంటారని, వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారి పేర్లు, వయసు, చిరునామా తదితర వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ.. రుయా మృతుల విషయంలో సీఎం, మంత్రులు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రిలో 5 నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని కొందరంటే, మరికొందరు 35 నిమిషాలు, 40 నిమిషాలు అంటున్నారని, ఏది నిజమో తెలియాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని, సీఎం తప్పిదం వల్ల చనిపోతున్న ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని రామానాయుడు డిమాండ్ చేశారు.


More Telugu News