రానున్న 4 నెలల్లో భారీగా పెరగనున్న దేశీయ టీకా సంస్థల తయారీ సామర్థ్యం

  • దేశంలో ఆందోళన కలిగిస్తున్న టీకాల కొరత
  • ఆగస్టు నాటికి భారీగా పెంచుతామని సంస్థల హామీ
  • భారత్‌ బయోటెక్ 7.82 కోట్లు, సీరం 10 కోట్ల డోసులకు పెంపు
  • ఎట్టిపరిస్థితుల్లో హామీని నిలబెట్టుకుంటామని భరోసా
దేశవ్యాప్తంగా కరోనా టీకా కొరత ఆందోళన కలిగిస్తున్న తరుణంలో దేశీయ వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కీలక విషయాన్ని వెల్లడించాయి. రానున్న నాలుగు నెలల్లో తమ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని కేంద్రానికి తెలిపాయి. తమ తయారీ సామర్థ్యాన్ని రానున్న రోజుల్లో గణనీయంగా పెంచనున్నామని పేర్కొన్నాయి. ఆగస్టు నాటికి ఉత్పత్తిని 10 కోట్ల డోసులకు పెంచుతామని సీరం, 7.8 కోట్లకు పెంచుతామని భారత్‌ బయోటెక్‌ తెలిపాయి. కేంద్రం ఆదేశాల మేరకు ఆయా సంస్థలు తమ ప్లాన్‌ను కేంద్రానికి అందించాయి.

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ తయారీని జులై నాటికి 3.32 కోట్ల డోసులకు, ఆగస్టు నాటికి 7.82 కోట్ల డోసులకు, సెప్టెంబరులోనూ ఇదే స్థాయిలో పెంచుతామని సంస్థ ప్రతినిధి డాక్టర్‌ వి.కృష్ణ మోహన్‌ తెలిపారు. ఇక మరో సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆగస్టు నాటికి తమ తయారీ సామర్థ్యాన్ని 10 కోట్ల డోసులకు పెంచుతామని.. సెప్టెంబరులో అదే స్థాయి కొనసాగిస్తామని స్పష్టం చేసింది.  

వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉన్న అన్ని వనరుల్ని వినియోగించుకుంటామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తామిచ్చిన హామీని నెరవేర్చి తీరతామని భరోసానిచ్చింది.


More Telugu News