తెలంగాణకు వ్యాక్సిన్లు, రెమ్‌డెసివిర్‌ సహా వైద్య సామగ్రి కోటాను పెంచుతామని కేంద్రం హామీ!

  • వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ సమీక్ష
  • తెలంగాణ నుంచి పాల్గొన్న హరీశ్‌రావు
  • కరోనా కట్టడికి చేపడుతున్న చర్యల్ని వివరించిన హరీశ్‌
  • ఆక్సిజన్‌ కోటాను సైతం పెంచాలని విజ్ఞప్తి
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రానికి కావాల్సిన రెమ్‌డెసివిర్‌, వ్యాక్సిన్లు, టెస్టింగ్‌ కిట్లు సహా ఇతర వైద్య సామగ్రి కోటాను పెంచుతామని హామీ ఇచ్చారు. నేడు వివిధ రాష్ట్రాలతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ రావు.. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఇంటింటికీ తిరిగి జ్వర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానితులకు సరైన ఔషధాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి లాక్‌డౌన్‌ విధించిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మెరుగైన వైద్య, ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలు ఉన్న నేపథ్యంలో చికిత్స కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తాకిడి పెరిగిందన్నారు.

తెలంగాణకు కేటాయించిన 450 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కోటాను 600 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని హరీశ్‌ కోరారు. ఏపీ, మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్‌ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టోసిజుమాబ్‌ ఇంజెక్షన్ల కోటాను 810 నుంచి 1500కు పెంచాలన్నారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో రెండో డోసువారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.


More Telugu News