పిల్లలపై కొవాగ్జిన్​ క్లినికల్​ ట్రయల్స్​

  • 2 నుంచి 18 ఏళ్ల మధ్య వారిపై ప్రయోగాలు
  • అనుమతులిచ్చిన కొవిడ్ 19 నిపుణుల కమిటీ
  • 525 మందిపై 2/3వ దశ ట్రయల్స్
కరోనా టీకా కొవాగ్జిన్ ను పిల్లలపై ప్రయోగాలు చేసేందుకు భారత్ బయోటెక్ కు మార్గం సుగమమైంది. 2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న వారిపై టీకా రెండు/మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ను చేసేందుకు కొవిడ్ 19 నిపుణుల కమిటీ అయిన సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) అనుమతులను ఇచ్చింది.

ఢిల్లీ, పాట్నాల్లోని ఎయిమ్స్, నాగ్ పూర్ లోని మెడిట్రినా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  సహా పలు చోట్ల 525 మంది పిల్లలపై ట్రయల్స్ చేయనున్నారు. భారత్ బయోటెక్ పెట్టుకున్న దరఖాస్తును అన్ని విధాలుగా పరిశీలించి పిల్లలపై ట్రయల్స్ చేసేందుకు అనుమతులిస్తున్నట్టు నిపుణుల కమిటీ పేర్కొంది.

సంస్థ ఫేజ్ 3 అధ్యయనం చేయడానికి ముందు రెండో దశలో వెల్లడైన టీకా భద్రతా ప్రమాణాల మధ్యంతర సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)కు సమర్పించాలని ఆదేశించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) సహకారంతో భారత్ బయోటెక్ కొవాగ్జిన్ ను తయారు చేసిన సంగతి తెలిసిందే.

కాగా, వ్యాక్సిన్ పరిశోధనలకుగానీ, అభివృద్ధి కోసం గానీ ఏ సంస్థలకూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని ఇటీవలే సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ కోసం మాత్రం కొద్ది మొత్తం సాయం చేసినట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో సంస్థకు కేంద్రం నుంచి మరికొంత ఆర్థిక సాయం అందే అవకాశాలున్నాయి.


More Telugu News