మూడు రాష్ట్రాల్లో చెక్‌పోస్టులను ఢీకొడుతూ రెచ్చిపోయిన ‘మహా’ యువకుడు!

  • సోమవారం అర్ధ రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు వీరంగం
  • చెక్‌పోస్టులను ఢీకొడుతూ వేగంగా దూసుకెళ్తూ భయపెట్టిన వైనం
  • పందిగూడ వద్ద పోలీసుల కాల్పులు
సోమవారం అర్ధ రాత్రి నుంచి నిన్న సాయంత్రం వరకు చత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఓ యువకుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా చింతూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు కారులో వేగంగా వస్తూ చెక్‌పోస్టును ఢీకొట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మోతుగూడెం మీదుగా వెళ్తూ అక్కడి బారికేడ్లను ఢీకొట్టి మారేడుమిల్లివైపు వెళ్లాడు.

అనంతరం చింతూరు మీదుగా వెనక్కి వచ్చి కల్లేరు వద్ద ఏర్పాటు చేసిన ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టును ఢీకొట్టి చత్తీస్‌గడ్‌వైపు వెళ్లాడు. అటునుంచి వస్తూ వరుసగా డోర్నపాల్, ఎర్రబోరు, ఇంజరం, కుర్తీ చెక్‌పోస్టులను ఢీకొట్టుకుంటూ వస్తుండగా పందిగూడ వద్ద పోలీసులకు చిక్కాడు. అతడిని నిలువరించేందుకు సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయత్నించినా అతడు కారును ఆపలేదు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి అతడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News