ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను భారత సరిహద్దులకు తరలిస్తున్న చైనా

  • వ్యూహాత్మకమేనంటున్న నిపుణులు
  • చైనా తరలించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు
  • షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ లో మోహరింపు
  • గాల్వన్ లోయకు సమీపంలోనే షిన్ జియాంగ్ కమాండ్
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ చైనా తన విస్తరణవాద ధోరణికే ప్రాధాన్యత నిస్తోంది. తాజాగా భారత సరిహద్దుల్లోకి ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను తరలిస్తోంది. టిబెట్ వద్ద ఉన్న ఓ స్థావరంలో వీటిని మోహరిస్తోంది. ఇక్కడి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ గాల్వన్ లోయకు సమీపంలోనే ఉంటుంది. గతేడాది గాల్వన్ లోయలో భారత, చైనా బలగాల మధ్య ఘర్షణలు జరిగి ఇరువైపులా ప్రాణనష్టం చోటుచేసుకుంది.

కాగా, యుద్ధ రంగంలో కీలకంగా భావించే రాకెట్ లాంచర్లను చైనా తరలించడం వ్యూహాత్మకమేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాకెట్ దాడులతో ప్రత్యర్థి పదాతి బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టడం సాధ్యమవుతుంది. షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ స్థావరానికి రాకెట్ లాంచర్ల తరలింపును చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీ వెల్లడించింది. ఇక్కడ మోహరించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు, శతఘ్నులు ఉన్నట్టు సీసీటీవీ విడుదల చేసిన చిత్రాల ద్వారా అర్థమవుతోంది.


More Telugu News