మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ జరుగుతోంది: దేవినేని ఉమ

  • కరోనా చావులోనూ ప్రశాంతత కరవవుతోంది
  • అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారు
  • బాధిత కుటుంబాల ఆవేదన వినపడుతోందా జగన్ గారూ?
ఏపీలో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలకు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితి చాలా చోట్ల నెలకొన్నట్టు మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. అంత్యక్రియలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

కరోనా చావులోనూ ప్రశాంతత కరువవుతోందని దేవినేని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహం తరలింపు మాటున అడ్డగోలు దోపిడీ జరుగుతోందని చెప్పారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తున్నారని... చికిత్స కంటే అంత్యక్రియల ఖర్చే ఎక్కువగా ఉంటోందని మండిపడ్డారు. కరోనా మాటున కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుటే యథేచ్చగా కాసుల దందా కొనసాగుతోందని అన్నారు. ఇదేం కర్మ అంటున్న బాధిత కుటుంబాల ఆవేదన వినపడుతోందా జగన్ గారూ? అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ తో పాటు వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన షేర్ చేశారు.


More Telugu News