ఒడిశాలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్రమంత్రి

  • బాలాసోర్ జిల్లాలో ఘటన
  • ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ప్రతాప్ చంద్ర సారంగి
  • కారును ఢీకొన్న ట్రాక్టర్
  • కేంద్రమంత్రి ముక్కుకు గాయం
  • ఆసుపత్రిలో చికిత్స
కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఒడిశాలో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రాక్టర్ ఢీకొనగా, ఆయన తేలికపాటి గాయాలతో బయటపడ్డారు. ప్రతాప్ చంద్ర సారంగి తన నియోజకవర్గంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతుండగా బాలాసోర్ జిల్లా నీలగిరి ప్రాంతంలో పుదసూల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా అదుపుతప్పిన ట్రాక్టర్... కేంద్రమంత్రి కారును ఢీకొంది.

ఈ రోడ్డు ప్రమాదంలో కేంద్రమంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, సెక్యూరిటీ ఆఫీసర్, కారు డ్రైవర్ కూడా గాయపడ్డారు. కేంద్రమంత్రి తదితరులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించారు. ముక్కుకు స్వల్ప గాయమైందని,  పూరీ జగన్నాథుడి దయ, తన మాతృమూర్తి దీవెనలతో క్షేమంగా బతికి బయటపడ్డానని తెలిపారు. తన సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని కేంద్రమంత్రి వివరించారు.


More Telugu News