ఐపీఎల్ నిలిపివేత నేపథ్యంలో స్వదేశం చేరిన కివీస్ బృందం

  • ఐపీఎల్ పై కరోనా పడగ నీడ
  • పలువురు ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి కరోనా
  • టోర్నీ నిరవధిక వాయిదా
  • ఈ సాయంత్రం ఆక్లాండ్ చేరుకున్న కివీస్ బృందం
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఐపీఎల్ పై పడడం తెలిసిందే. కొన్ని మ్యాచ్ లు జరిగిన అనంతరం ఐపీఎల్ లో కరోనా కలకలం రేగడంతో టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ లో వివిధ రకాల సేవలు అందిస్తున్న కివీస్ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. ఈ సాయంత్రమే వారు న్యూజిలాండ్ చేరుకున్నారు. ఇప్పటికే కొందరు కివీస్ ఆటగాళ్లు స్వదేశం చేరుకోగా, బ్రెండన్ మెకల్లమ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, కైల్ మిల్స్, లాకీ ఫెర్గుసన్, సైమన్ డౌల్, స్కాట్ స్టైరిస్, క్రిస్ గఫానీలతో కూడిన రెండో బృందం నేడు ఆక్లాండ్ లో అడుగుపెట్టింది.

మెక్ కల్లమ్, కైల్ మిల్స్, లాకీ ఫెర్గుసన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి చెందినవారు కాగా, స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్. సైమన్ డౌల్, స్కాట్ స్టైరిస్ క్రికెట్ వ్యాఖ్యాతలు. క్రిస్ గఫానీ ఐపీఎల్ అంపైర్. వీరందరిలో ఫెర్గుసన్ ఒక్కడే ప్రస్తుత ఆటగాడు. మిగతా అందరూ మాజీలే.

న్యూజిలాండ్ చేరుకున్న వీరందరికీ కరోనా ప్రోటోకాల్ అనుసరించి 14 రోజుల క్వారంటైన్ విధించనున్నారు. ప్రపంచంలో కరోనాను సమర్థంగా కట్టడి చేసిన దేశాల్లో న్యూజిలాండ్ ఒకటి. గతేడాదే న్యూజిలాండ్ ను కరోనా రహిత దేశంగా ప్రకటించారు.


More Telugu News