ఒకరికొకరం సాయం చేసుకొని ఈ పరిస్థితి నుంచి బయటపడదాం: హీరో నిఖిల్‌ సందేశం

  • కళ్ల ముందే చనిపోవడం బాధాకరం
  • తోచిన సాయం చేస్తున్నాం.. అయినా సరిపోదు
  • రాజకీయ నాయకులు పరస్పర విమర్శలకే పరిమితం
  • ఇంకా కొంతమంది సాయం చేస్తుండడం ప్రశంసనీయం
  • ట్విట్టర్‌ వేదికగా నిఖిల్‌ వీడియో సందేశం
దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై హీరో నిఖిల్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఒకరికొరు అండగా ఉండాలని పిలుపునిచ్చాడు. సాయం కోరిన వారు కళ్ల ముందే చనిపోతుంటే తట్టుకోలేకపోతున్నానంటూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశాడు.

‘‘కోపం, చిరాకు, నిరాశ, నిస్సహాయ స్థితిలో ఉండి ఈ వీడియోను చేస్తున్నాను. గత 2-3 వారాలుగా షూటింగులన్నీ రద్దయ్యాయి. దీంతో కరోనా నుంచి తప్పించుకోవడం కోసం మా కుటుంబ సభ్యులమంతా ఇంట్లోనే ఉంటున్నాం. సోషల్‌ మీడియా వేదికగా నేను, కొంత మంది స్నేహితులం కలిసి తోచిన సాయం చేస్తున్నాం. ఔషధాలు, ఆసుపత్రుల్లో పడకలు, ఐసీయూ.. ఇలా ప్రజలకు కావాల్సిన సాయం అందజేస్తున్నాం. మేం ఎంత చేసినా.. అది సరిపోవడం లేదు. బయట పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కళ్ల ముందే ప్రజలు చనిపోతున్నారు. చాలా దగ్గరివాళ్లే చనిపోతుండడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. రాజకీయ నాయకులకు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడంలోనే సరిపోతుంది.

అయితే, కొన్ని వర్గాల వారు చేస్తున్న సాయం చూస్తుంటే ఇంకా మానవత్వం బతికే ఉందనిపిస్తుంది. ఇలాగే ఒకరికొకరు సాయం చేసుకుందాం. ఈ మహమ్మారి నుంచి బయటపడదాం. అందరూ మాస్కులు ధరించండి. శానిటైజ్‌ చేసుకోండి. ఎవరినీ కలవొద్దు. ఆరు గజాల దూరం మెయింటెన్ చేయండి. కావాలంటే రెండు మాస్కులు ధరించండి’’ అని నిఖిల్‌ తన ట్విటర్‌ ఖాతాలో ఓ సందేశాన్ని ఉంచారు.


More Telugu News