మద్యం తాగేవారికి కరోనా సోకితే కోలుకోవడం కష్టమేనట!

  • మద్యం, పొగతాగే వారిలో సన్నగిల్లే రోగ నిరోధక శక్తి
  • కరోనా సోకితే మరణాలు అధికం
  • చిన్నారుల్లో గొంతునొప్పి, విరేచనాలు కూడా కొవిడ్ లక్షణాలే
మద్యం, ధూమపానం అలవాట్లు ఉన్న వారికి ఇది షాకింగ్ న్యూసే. ఈ అలవాట్లు ఉన్న వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, వీరు కనుక కరోనా బారినపడితే కోలుకోవడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిన్న నిర్వహించిన సంయుక్త వెబినార్‌లో పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ మొదటి దశలో వృద్ధులు, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రభావం చూపిస్తే రెండో దశలో యువత, చిన్నారులు, గర్భిణులపై చూపిస్తోందని వెబినార్‌లో పాల్గొన్న పీడియాట్రిక్ నిపుణుడు డాక్టర్ చేతన్ ముందాడ, శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ విశ్వేశ్వరన్ పేర్కొన్నారు. చిన్నారుల్లో తీవ్రత ఎక్కువగా ఉండడం లేదని, ఇది కొంత ఊరటనిచ్చే విషయమని అన్నారు. అయినప్పటికీ అప్రమత్తత అవసరమన్నారు. పిల్లలు అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నా, జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నా, గొంతులో ఇబ్బందిగా ఉన్నా వాటిని కరోనా లక్షణాలుగానే పరిగణించాలని పేర్కొన్నారు.

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాతే ఫలితం కనిపిస్తుందని వెబినార్‌లో పాల్గొన్న నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా 10-30 శాతం మందికి కొవిడ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి రోజూ బ్రీతింగ్ వ్యాయామం చేయడం ద్వారా ఆక్సిజన్ స్థాయులను పెంచుకోవచ్చన్నారు. మద్యం, పొగ తాగే వారు కనుక కరోనా మహమ్మారి బారినపడితే కోలుకోవడం కష్టమని, వీరిలో మరణాల రేటు కూడా అధికంగా ఉంటోందని నిపుణులు పేర్కొన్నారు.


More Telugu News