ఇతర సంస్థల నుంచి వ్యాక్సిన్ సేకరణకు అనుమతించండి: ప్రధాని మోదీకి మహారాష్ట్ర సీఎం విజ్ఞప్తి

  • దేశంలో కరోనా వ్యాక్సిన్లకు కటకట
  • వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తిలో భారత్ బయోటెక్, సీరం ముమ్మరం
  • రాష్ట్రాల్లో ముందుకు కదలని వ్యాక్సినేషన్
  • ప్రధానికి లేఖ రాసిన ఉద్ధవ్ థాకరే
  • అనుమతిస్తే ఒక్కసారే వ్యాక్సిన్లు కొనుగోలు చేస్తామని వెల్లడి
దేశంలో 4 లక్షలకు పైగా రోజువారీ కరోనా కేసులు వస్తుండగా, వ్యాక్సిన్లకు తీవ్రమైన కొరత ఏర్పడింది. తొలి డోసు తీసుకున్న చాలామందికి ఇంకా రెండో డోసు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. భారత్ లో ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వినియోగిస్తున్నారు. కొవాగ్జిన్ ను భారత్ బయోటెక్, కొవిషీల్డ్ ను సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్నాయి. యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ దేశీయ అవసరాలు తీరడంలేదు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇతర సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్లు సేకరించేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. తమ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరత అధికంగా ఉందని, వీలైతే రాష్ట్ర ప్రజలందరికి సరిపోయేలా ఒక్కసారే వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని థాకరే వెల్లడించారు.

కానీ దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల వద్ద తగినన్ని నిల్వలు లేవని, ఈ నేపథ్యంలో ఇతర ఉత్పత్తిదారుల నుంచి వ్యాక్సిన్ కొనుగోళ్లకు రాష్ట్రాలను అనుమతిస్తే స్వల్పకాలంలోనే అధిక సంఖ్యలో జనాభాకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలవుతుందని వివరించారు. తద్వారా కరోనా థర్డ్ వేవ్ ను కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.


More Telugu News