చిన్నచిన్న దేశాల నుంచి సాయం తీసుకునే స్థితికి దిగజారిపోయాం: కేంద్రంపై శివసేన ఫైర్

  • మన దేశ పరిస్థితిపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది
  • భారత్ కు సాయం చేయాలని ఇతర దేశాలకు యూనిసెఫ్ పిలుపునిచ్చింది
  • ప్రస్తుత పాలకుల వల్ల దేశ పరిస్థితి దారుణంగా తయారైంది
దేశంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉన్న నేపథ్యంలో మనకు పొరుగున ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా సాయం చేస్తున్నాయని... కానీ, మన కేంద్ర ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లతో ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టును పూర్తి చేయడంపైనే దృష్టి సారించిందని శివసేన పార్టీ మండిపడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన దేశం తట్టుకుని నిలబడటానికి నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ వంటి మాజీ ప్రధానులే కారణమని తెలిపింది.

ప్రస్తుతం మన దేశంలో కరోనా వేగంగా వ్యాపిస్తుండటంపై యూనిసెఫ్ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని శివసేన వ్యాఖ్యానించింది. భారత్ కు ఇతర దేశాలు సాయం చేయాలని కూడా పిలుపునిచ్చిందని చెప్పిందని తెలిపింది. భూటాన్, నేపాల్, మయన్మార్, శ్రీలంక వంటి దేశాలు కూడా మనకు సాయం చేస్తున్నాయని... బాంగ్లాదేశ్ 10 వేల రెమ్ డెసివిర్ వయల్స్ ను పంపిందని తెలిపింది. నెహ్రూ, గాంధీల కుటుంబాల వల్లే భారత్ ఇప్పటికీ మనుగడ సాగిస్తోందని చెప్పింది.

పాకిస్థాన్, రువాండా, కాంగో లాంటి దేశాలు ఇతర దేశాల నుంచి సాయం తీసుకుంటే ఒక అర్థం ఉంటుందని... కానీ ప్రస్తుత పాలకుల వల్ల భారత్ కూడా ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి దాపురించిందని మండిపడింది. కరోనా కంటే సెంట్రల్ విస్టాకే ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చిందని తీవ్రంగా విమర్శించింది. 


More Telugu News