కరోనా బారిన పడిన టీమిండియా క్రికెటర్

  • కర్ణాటక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా
  • ఐపీఎల్ లో కోల్ కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ్
  • కోల్ కతా జట్టులో నాలుగుకు పెరిగిన కరోనా బాధితులు
  • డబ్ల్యూటీసీ ఫైనల్ కు స్టాండ్ బై బౌలర్ గా ఎంపికైన ప్రసిద్ధ్
ఇంగ్లండ్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు స్టాండ్ బైగా ఎంపికైన కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ (25) కరోనా బారినపడ్డాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ప్రసిద్ధ్ కృష్ణ ప్రస్తుతం తన స్వస్థలం బెంగళూరులోనే హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

ఈ పొడగరి ఫాస్ట్ బౌలర్ కు కరోనా సోకడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో కరోనా పాజిటివ్ ఆటగాళ్ల సంఖ్య నాలుగుకి పెరిగింది. ఇంతకుముందు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్ లకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. వరుణ్ చక్రవర్తికి ప్రసిద్ధ్ కృష్ణ ఎంతో సన్నిహితుడని, వరుణ్ చక్రవర్తి నుంచి సందీప్ వారియర్ కు, ప్రసిద్ధ్ కృష్ణకు కరోనా సోకిందని బీసీసీఐ వర్గాలు వివరించాయి. ఐపీఎల్ అర్థాంతరంగా ముగియడంతో ప్రసిద్ధ్ కృష్ణ మే 3న ఐపీఎల్ బబుల్ ను వీడి స్వస్థలం బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.

ఇక, ఇంగ్లండ్ వెళ్లే టీమిండియా ఆటగాళ్లకు మే 25 నుంచి బయోబబుల్ ఏర్పాటు చేస్తుండగా, ఆ సమయానికి ప్రసిద్ధ్ కృష్ణ కోలుకుంటాడని బీసీసీఐ ఆశాభావంతో ఉంది.


More Telugu News