మూడు డోసుల కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది!

  • జైకోవ్-డీ వ్యాక్సిన్ ను తయారు చేయనున్న జైడస్ క్యాడిలా
  • ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేయనున్న జైడస్
  • నెలకు కోటి డోసుల ఉత్పత్తే లక్ష్యం
మన దేశంలో కరోనా వ్యాక్సిన్ కొరతతో జనాలు అల్లాడుతున్నారు. మన దేశ జనాభాకు అవసరమైన వ్యాక్సిన్లను తయారు చేయడం ఫార్మా కంపెనీల వల్ల కావడం లేదు. ప్రస్తుతం కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా... త్వరలోనే స్పుత్నిక్ కూడా ప్రజలకు అందుబాటులోకి రానుంది.

ఈ క్రమంలో తాజాగా నాలుగో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ 'జైకోవ్-డీ' వ్యాక్సిన్ అనుమతుల కోసం దరఖాస్తు చేయబోతోంది. ఈ నెలలోనే వ్యాక్సిన్ కు అనుమతులు లభిస్తాయని ఆ సంస్థ నమ్మకంగా ఉంది.

జైకోవ్-డీ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ లో ఉంది. ఇప్పటి వరకు 28 వేల మందిపై ప్రయోగాలు జరిపింది. మూడో దశ ఫలితాలు వచ్చిన వెంటనే అత్యవసర వినియోగానికి సదరు సంస్థ దరఖాస్తు చేయనుంది. తమ వ్యాక్సిన్ కు ప్రభుత్వ అనుమతులు వస్తాయని భావిస్తున్నట్టు జైడస్ తెలిపింది. ప్రతి నెల కోటి డోసుల ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకున్నామని వెల్లడించింది.

అయితే, ఇప్పటి వరకు మనకు అందుబాటులో వ్యాక్సిన్లు రెండు డోసులకు చెందినవి. కానీ, జైకోవ్ వ్యాక్సిన్ మాత్రం మూడు డోసులు వేసుకోవాల్సి ఉంటుంది. తొలి డోసు వేసుకున్న నెల రోజులకు రెండో డోసు, ఆ తర్వాత నెలకు మూడో డోసు వేసుకోవాలి. మూడు డోసుల వల్ల అధిక రోగ నిరోధక శక్తి లభిస్తుందని, యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని సదరు  సంస్థ తెలిపింది.


More Telugu News