ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకుంది: మెడికల్ జర్నల్ లాన్సెట్ తీవ్ర విమర్శలు

  • విమర్శలను తిప్పకొట్టడంపై పెట్టిన దృష్టి కరోనా నియంత్రణపై పెట్టి ఉండే బాగుండేది
  • అదే జరిగితే ఆగస్టు నాటికి దేశంలో 10 లక్షణ మరణాలు
  • హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేసినట్టు తప్పుడు ప్రకటనలు
  • సీరో సర్వే తర్వాతైనా జాగ్రత్త పడి ఉండాల్సింది
  • ఎన్నికలు, టీకాలు మందకొడిగా సాగడం, భారీ ర్యాలీలు భారత్ కొంపముంచాయి
భారత్‌లో రెండో దశలో కరోనా వైరస్ చెలరేగిపోతున్న వేళ మోదీ ప్రభుత్వంపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా, మెడికల్ జర్నల్ ‘లాన్సెట్’ తన సంపాదకీయంలో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. కరోనా నియంత్రణలో ప్రారంభ విజయాలను భారత్ చేజేతులా నాశనం చేసుకుందని పేర్కొంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ ఏప్రిల్ వరకు ఒక్కసారి కూడా సమావేశం కాని విషయాన్ని ప్రస్తావించింది. దాని ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోందని, ఇప్పుడిది దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ సునిశిత విమర్శలు చేసింది. పరిస్థితులు చేయిదాటి సంక్షోభం కనుక మరింత తీవ్రమైతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని పారదర్శకంగా వ్యవహరిస్తే మహమ్మారిపై విజయం సాధించవచ్చని పేర్కొంది.

అంతేకాదు, ప్రధాని మోదీపైనా లాన్సెట్ తన సంపాదకీయంలో తీవ్ర విమర్శలు చేసింది. కరోనా సంగతిని పక్కనపెట్టి తనను విమర్శిస్తున్న వారిపై కొరడా ఝళిపించే ప్రయత్నం చేశారని రాసుకొచ్చింది. విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ బహిరంగ చర్చలకు దూరంగా ఉండడం క్షమార్హం కాదని తేల్చి చెప్పింది. ఆగస్టు 1 నాటికి దేశంలో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనా వేసిందని, అదే జరిగితే ఆ జాతీయ విపత్తుకు మోదీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో విరుచుకుపడడానికి ముందే కరోనా మహమ్మారి కథ ముగిసిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించడాన్ని లాన్సెట్ తన సంపాదకీయంలో గుర్తు చేసింది. సెకండ్ వేవ్ ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నప్పటికీ కేసులు తగ్గిపోవడంతో కరోనాను జయించేశామన్న భావనకు భారత్ వచ్చేసిందని రాసుకొచ్చింది.

భారత్‌ హెర్డ్ ఇమ్యూనిటీని సాధించేసినట్టు కొన్ని మోడల్స్ తప్పుగా చెప్పాయని, అది నిర్లక్ష్యానికి కారణమై ముందస్తు సన్నద్ధతను దెబ్బతీసిందని అభిప్రాయపడింది. ఐసీఎంఆర్ జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశంలో 21 శాతం జనాభాలో మాత్రమే ప్రతిరక్షకాలు ఉన్నట్టు తేలిందని, ఆ సమయంలో మోదీ ప్రభుత్వం ట్విట్టర్‌లో వచ్చిన విమర్శలను తొలగించడంపై కాకుండా కొవిడ్ నియంత్రణపై దృష్టిసారించి ఉంటే పరిస్థితి ఇంత దిగజారేది కాదని వివరించింది.

అలాగే, ఎన్నికలు నిర్వహించడం, భారీ రాజకీయ ర్యాలీలు, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగడం, రాష్ట్రాలతో మాటమాత్రమైనా చెప్పకుండానే వ్యాక్సినేషన్ విధానంలో మార్పులు తేవడం వంటివి కూడా భారత్‌లోని ప్రస్తుత పరిస్థితికి కారణాలని స్పష్టం చేసింది.


More Telugu News