వైఎస్సార్ కొడుకువై ఉండీ వాటికి భయపడతారా?: జగన్ ట్వీట్‌పై ఒడిశా ఎంపీ కౌంటర్

  • హేమంత్ సోరెన్ ట్వీట్‌పై జగన్ స్పందనను ఆక్షేపించిన ఒడిశా ఎంపీ
  • మీ రాజకీయ ప్రయోజనాలకు మోదీతో లాలూచీనా?
  • మీరింకా ఎదగాలి జగన్ అంటూ ట్వీట్
ప్రధాని నరేంద్రమోదీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చేసిన ట్వీట్‌కు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించడం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కరోనా నియంత్రణపై పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మొన్న ఫోన్‌లో మాట్లాడారు.  అనంతరం హేమంత్ సోరెన్ నిన్న ట్వీట్ చేస్తూ ప్రధాని తన మాటలు వినలేదని, ఆయన చెప్పాలనుకున్నదే చెప్పారని అన్నారు. దానికి బదులుగా ప్రధాని కొన్ని పనికొచ్చే మాటలు చెప్పి, పనికొచ్చే మాటలు వింటే బాగుండేదంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఝార్ఖండ్ సీఎం ట్వీట్‌పై జగన్ స్పందిస్తూ.. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ఇలాంటి రాజకీయాలు తగవని, ఒకరినొకరం వేలెత్తి చూపించుకోవద్దని, అందుకు ఇది సమయం కాదని అన్నారు. మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో ప్రధానికి అండగా నిలబడదామని హితవు పలికారు.

జగన్ ట్వీట్‌పై స్పందించిన ఒడిశా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా రీట్వీట్ చేస్తూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీతో లాలూచీ పడడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజశేఖరరెడ్డి లాంటి పెద్ద నేతకు కుమారుడివై ఉండీ ఇలా సీబీఐ, ఈడీ దాడులకు భయపడి ప్రధానికి దాసోహం కావడమేంటని ప్రశ్నించారు. 'ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీరు మరింత ఎదగాలి' అంటూ విమర్శలు కురిపించారు.


More Telugu News