ప్రయాణికులు లేక 28 రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

  • సికింద్రాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, నాందేడ్ మీదుగా నడిచే రైళ్లు రద్దు
  • మరిన్ని నిబంధనలు తీసుకొచ్చిన రైల్వే
  • వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు నో ఎంట్రీ
కరోనా నేపథ్యంలో ప్రయాణికుల నుంచి ఆదరణ లేకపోవడంతో 28 ప్రత్యేక రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. రద్దు అయిన రైళ్లలో నేడు నడవాల్సిన తిరుపతి-విశాఖపట్టణం, సికింద్రాబాద్-కర్నూలు సిటీ, కర్నూలు సిటీ-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-రేణిగుంట, విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-గూడూరు, నాందేడ్-జమ్ముతావి, బిట్రగుంట-చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్-బిట్రగుంట, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్, నర్సాపూర్-నాగర్‌సోల్, సికింద్రాబాద్-విజయవాడ, విజయవాడ-సికింద్రాబాద్, హైదరాబాద్-సిర్పూరు కాగజ్‌నగర్, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్ రైళ్లు ఉన్నాయి.  

రేపు నడవాల్సిన విశాఖ-తిరుపతి, రేణిగుంట-కాకినాడ టౌన్, లింగంపల్లి-విజయవాడ, తిరుపతి-కరీంనగర్, గూడూరు-విజయవాడ, సికింద్రాబాద్-విశాఖపట్టణం, సిర్పూరు కాగజ్‌నగర్-సికింద్రాబాద్, నాగర్‌సోల్-నర్సాపూర్ రైళ్లు, 9న నడిచే కాకినాడ టౌన్-లింగంపల్లి, కరీంనగర్-తిరుపతి, జమ్ముతావి-నాందేడ్, విశాఖపట్టణం-సికింద్రాబాద్, 10న నడిచే లింగంపల్లి -కాకినాడ టౌన్ రైళ్లు ఉన్నాయి.

అలాగే, కరోనా నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరిన్ని నిబంధనలను రైల్వే అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు రైళ్లలోకి వెయింటింగ్ లిస్ట్ ప్రయాణికులను కూడా అనుమతిస్తుండగా, ఇకపై ఆ అవకాశం లేదు. అన్‌రిజర్వుడు కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే వీరిని అనుమతిస్తారు.

ప్రీపెయిడ్ క్యాటరింగ్ సౌకర్యాన్ని కూడా రద్దు చేశారు. రెడీ టు ఈట్ భోజనాన్ని, ప్యాకేజింగ్ ఫుడ్ అయిటమ్స్‌ను మాత్రమే అనుమతిస్తారు. ప్రయాణికులు ఇకపై ఎవరికి వారే దుప్పట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలి. ధర్మల్ స్క్రీనింగ్‌లో లక్షణాలు లేనివారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగించాలి.


More Telugu News